NAGABANDHAM: చిరంజీవి క్లాప్‌తో నాగబంధం' చిత్రీకరణ ప్రారంభం
- పెదకాపు హీరో రెండో ప్రయత్నంగా నాగబంధం
- పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు
- డివైన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో కథ
పెదకాపు చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో 'నాగబంధం ది 'సీక్రెట్ ట్రెజర్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర నటుడు చిరంజీవి హీరో హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. "తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఈ సినిమా కథ భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ తిరుగుతుంది. ఆ అంశాల ప్రేరణతో తయారుచేసుకున్న కథ ఇది" అన్నారు.
ఈ నెల 23 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని... తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.