KTR: ముత్యాలమ్మ ఆలయం ఘటన... తీవ్రంగా స్పందించిన కేటీఆర్
- సికింద్రాబాద్‌లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు
- ఇలాంటి ఘటనలు నగరానికి మచ్చను తీసుకువస్తాయన్న కేటీఆర్
- ఇలాంటి దుర్మార్గులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఘటనను ఆయన ఖండించారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్రకలకలం రేపుతోందని పేర్కొన్నారు. ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన హైదరాబాద్ నగరం సహనశీలతకు మచ్చను తీసుకు వస్తాయన్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
ఏం జరిగింది?
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేముందు నిందితుడు ఆలయం గేట్‌ను కాలితో తన్ని లోపలకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.