Rains: ఏపీలో భారీ వర్షాలు... జిల్లాలకు వరద సాయం నిధుల విడుదల
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున నిధులు
- జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి నుంచి ఆదేశాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం వర్ష ప్రభావిత జిల్లాలకు వరద సహాయ నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేసింది.
ఈ నిధులతో సహాయ శిబిరాలు, ఆహారం, తాగునీరు, ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యం కోసం ఈ అత్యవసర నిధులను మంజూరు చేశారు. వరద బాధితుల తరలింపునకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. నేలకూలిన చెట్లను తొలగించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.