TG DSC: తెలంగాణలో డీఎస్సీ కౌన్సెలింగ్ వాయిదా.. షాక్‌లో అభ్యర్థులు
- షెడ్యూల్ ప్రకారం ఇవాళ అభ్యర్థులకు కౌన్సెలింగ్
- ఆఖరి నిమిషంలో కౌన్సెలింగ్‌ను వాయిదా వేసిన విద్యాశాఖ
- త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడి
- డీఎస్సీ-2024 ద్వారా టీచర్లుగా ఎంపికైన 10,006 మంది అభ్యర్థులు
తెలంగాణలో ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఈ రోజు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇస్తారనుకుంటున్న సమయంలో ఊహించని ప్రకటన వెలువడింది. విద్యాశాఖ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కౌన్సెలింగ్ కోసం కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. ఇక డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.
దీంతో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు సంబరపడిపోయారు. ఇక కౌన్సెలింగ్ అవ్వడమే లేటు పోస్టింగ్ వచ్చేస్తుందనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆఖరి నిమిషంలో విద్యాశాఖ ఇవాళ్టి కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది. దీంతో అభ్యర్థులు ఒకింత షాక్‌కు గురయ్యారు. తదుపరి కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూడక తప్పనిపరిస్థితి తలెత్తింది.