Mahadevappa: హిందూ మతాన్ని వీడి బౌద్ధ మతంలోకి వెళుతున్న కర్ణాటక మంత్రి
- హిందూ మతంలో కులాల పిచ్చి కొనసాగుతోందన్న మహదేవప్ప
- భవిష్యత్తులో కూడా మార్పు వచ్చే అవకాశం లేదని వ్యాఖ్య
- బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తానని వెల్లడి
బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానంటూ కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప సంచలన ప్రకటన చేశారు. హిందూ మతంలో కులాల పిచ్చి కొనసాగుతోందని, కుల జబ్బు పోవడం లేదని, భవిష్యత్తులో కూడా మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆయన అన్నారు.
సమానత్వం, స్వాతంత్ర్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని తాను ఇష్టపడతానని చెప్పారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నానని తెలిపారు.
మైసూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మహదేవప్ప మైసూరు దసరా ఉత్సవాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. దాదాపు 20 రోజులు మైసూరులో ఉండి ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేశారు. అలాంటి ఆయన హిందూ మతాన్ని వీడుతానని చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.