Harish Rao: రేవంత్ రెడ్డి ఊసరవెల్లిలా మారారు: హరీశ్ రావు
- కానిస్టేబుళ్ల లీవ్ మాన్యువల్ ను మార్చారని హరీశ్ విమర్శ
- టీఏను 7 రోజులకు కుదించారని మండిపాటు
- పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులు విడుదల చేయడంలేదన్న హరీశ్
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఊసరవెల్లిలా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లకు జరుగుతున్న శ్రమ దోపిడీపై అసెంబ్లీలో రేవంత్ మాట్లాడారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి బదులు... నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ ను మార్చారని విమర్శించారు. కుటుంబాలకు వారాల పాటు దూరం చేయడమే పోలీసులకు మీరు ఇచ్చిన దసరా, దీపావళి గిఫ్ట్ అని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఆర్, సివిల్, ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 7 రోజులకు కుదించిందని హరీశ్ విమర్శించారు. సివిల్ పోలీసులు ఉపయోగించే వాహనాల డీజిల్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఈ నిధుల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి వచ్చిందని అన్నారు.