mla akhilapriya: నంద్యాలలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగింపు... తీవ్రంగా స్పందించిన అఖిలప్రియ
- అఖిలప్రియ తన సీటులో కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి
- ఎస్వీ జగన్మోహనరెడ్డితో ఎమ్మెల్యే అఖిలప్రియ వాగ్వివాదం
- తొలగించిన శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసిన అఖిలప్రియ
వైసీపీ నేత, నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి తీరుపై ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. అఖిలప్రియ మంగళవారం నంద్యాలలోని విజయ డెయిరీ కార్యాలయానికి అనుచరులతో కలిసి వెళ్లారు. విజయ డెయిరీ వద్ద కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత ఎన్టీఆర్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధునికీకరణ పేరుతో ఇలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. శిలాఫలకాన్ని తొలగించిన డెయిరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహనరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రోటోకాల్ విస్మరించి ఎన్టీఆర్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. డెయిరీలో పక్కన పెట్టిన శిలాఫలకానికి అఖిలప్రియ క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి చైర్మన్ సీటులో కూర్చున్నారు. ఎండీతో అఖిలప్రియ మాట్లాడుతున్న సమయంలో డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహనరెడ్డి ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది కూర్చోమంటేనే తాను కూర్చున్నానని అఖిలప్రియ బదులిచ్చారు.
‘నాతో మామగా మాట్లాడుతున్నావా.. లేక చైర్మన్గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావు అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో.. గతంలో మా కుర్చీలో మీరు కూర్చోలేదా.. నన్ను కుర్చీలో నుండి కదపండి చూద్దాం' అంటూ ఎస్వీ జగన్మోహనరెడ్డికి ఆమె సవాల్ చేశారు. ఇలా ఇద్దరి మధ్య కొద్ది సేపు మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారం కర్నూలు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.