Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య నేపథ్యంలో... సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు
- ఈ నెల 12న సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య
- సిద్ధిఖీని కాల్చి చంపింది తామేనని ప్రకటించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
- సల్మాన్ భద్రతను వై ఫ్లస్ క్యాటగిరీకి పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామంటూ గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించడం, ఆ క్రమంలోనే ఆయన సన్నిహితుడైన బాబా సిద్ధిఖీ హత్యకు గురి కావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఏడాది జూన్‌లో సల్మాన్ ను హత్య చేసేందుకు విఫలయత్నం జరిగింది. ఆయన కారును ఆపి ఏకే 47తో దాడి చేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రణాళిక సిద్ధం చేసుకోగా, ముంబయి పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
ఇక బాబా సిద్ధిఖీని కాల్చి చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ నెల 12న బాబా సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారు. ఈ ఘటనతో మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ముంబయిలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలో ఎవరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోకుండా పోలీసులు నిషేధం విధించారు.
అలాగే సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర సర్కార్ భద్రతను పెంచింది. సల్మాన్ ఖాన్ భద్రతను వై ప్లస్ క్యాటగిరీకి పెంచారు. ఎస్కార్ట్ వాహనం కూడా ఏర్పాటు చేయడంతో పాటు శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుళ్లను నియమించారు. సల్మాన్‌కు చెందిన పన్వెల్ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసుల భద్రతను పెంచడంతో పాటు రాకపోకలు సాగించే వారిని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.