AP Govt: నేడు ఏపీలో 8 మంది బీసీ మంత్రుల కీలక భేటీ .. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కసరత్తు
- ఏపీ సచివాలయంలో ఈ రోజు బీసీ మంత్రుల సమావేశం
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు హామీ
- బీసీల రక్షణ చట్టం విధివిధానాలపై చర్చించనున్న మంత్రులు
బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం ఈరోజు (బుధవారం) నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సమావేశం జరుగుతోందని తెలిపారు. ఈ మేరకు మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఎనిమిది మంది బీసీ మంత్రులు సమావేశమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
తనతో పాటు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సమావేశంలో బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని తెలిపారు.