Extreme Heavy Rains: నెల్లూరుకు 400 కి.మీ దూరంలో వాయుగుండం
- నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- అక్టోబరు 17న పుదుచ్చేరి-నెల్లూరు మధ్యన తీరం దాటే అవకాశం
- నేడు ఏపీలో అత్యంత భారీ వర్షాలు
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రేపు (అక్టోబరు 17) ఉదయం పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.