Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్‌కు పరిమితికి మించి డబ్బు ముట్టుజెప్పాలని నిర్ణయించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- ఏకంగా రూ.23 కోట్లతో రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్టు కథనాలు
- రిటెన్షన్ గరిష్ఠ స్లాబ్ రూ.18 కోట్ల కంటే అదనంగా మరో రూ.5 కోట్లు ఖర్చు చేయాలని యోచన
- నిబంధనలు అనుమతిస్తుండడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లలో ఒకడైన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను ఎలాగైనా నిలుపుదల చేసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందుకోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించిన గరిష్ఠ స్లాబ్‌కు మించి ఎక్కువ డబ్బు చెల్లించాలని యోచిస్తోంది. ఐపీఎల్ రిటెన్షన్ గరిష్ఠ స్లాబ్ రూ.18 కోట్లుగా ఉండగా అదనంగా మరో రూ.5 కోట్లు కలిపి మొత్తం రూ.23 కోట్లు ఆఫర్ చేసి అతడిని నిలుపుదల చేసుకోవాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తున్నట్టు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో, క్రిక్‌బజ్ కథనాలు పేర్కొంటున్నాయి.
ఆటగాళ్ల రిటెన్షన్ కోసం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా రూ. 75 కోట్లు ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉండడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ మేరకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్ణీత స్లాబ్‌ల కంటే ఎక్కువ లేదా తక్కువ మొత్తంతో ఆటగాళ్లను నిలుపుదల చేసుకునేందుకు అవకాశం ఉండడంతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. రిటెన్షన్ ఆటగాళ్లకు నిర్దేశించిన స్లాబ్‌ల ప్రకారం లేదా హెచ్చుతగ్గులతో నిర్దేశించిన రూ.75 కోట్లకు సమానంగా ఫ్రాంచైజీలు ఖర్చు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం మొదటి రిటెన్షన్ ఆటగాడి ధర రూ.18 కోట్లు, రెండవ ఆటగాడికి రూ.14 కోట్లు, మూడవ ఆటగాడిపై రూ.11 కోట్లు కాగా నాలుగవ ప్లేయర్‌పై తిరిగి రూ.18 కోట్లు, ఐదవ ఆటగాడికి రూ.14 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.4 కోట్లు ఫ్రాంచైజీలు ఖర్చు చేయాలి. అయితే రూ.75 కోట్లకు మించకుండా ధరలో ఏ విధమైన మార్పులు చేసేందుకైనా అవకాశం ఉంది. అందుకే హెన్రీచ్ క్లాసెన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గరిష్ఠ రూ.18 కోట్ల స్లాబ్ కంటే ఎక్కువ వెచ్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.