Snake: సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు... వీడియో ఇదిగో!
- గుజరాత్‌లోని వడోదరలో ఘటన
- రోడ్డుపక్కన పాము నిర్జీవంగా పడి ఉన్నట్టు జంతు సంరక్షకులకు ఫోన్
- పామును చేతుల్లోకి తీసుకుని సీపీఆర్ ఇచ్చిన యశ్ తాడ్వి అనే యవకుడు
- ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ప్రాణాపాయంలో ఉన్న వారికి నోటితో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) ఇచ్చి ప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే పాములో చలనం వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలకు ముగ్ధులవుతున్నారు.