Kadambari Jethwani Case: నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ కు రిమాండ్ పొడిగింపు
- సంచలనం సృష్టించిన ముంబయి నటి జెత్వానీ కేసు
- ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగింపు
- ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న విద్యాసాగర్
ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. విజయవాడ నాలుగో ఏసీఎంఎం కోర్టు విద్యాసాగర్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ పొడిగిస్తూ నేడు ఉత్తర్వులు ఇచ్చింది. జెత్వానీ కేసులో విద్యాసాగర్ ఏ1గా ఉన్నాడు. విద్యాసాగర్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
కాగా, ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కుక్కల విద్యాసాగర్ తో పాటు మరో ఐదుగురిని చేర్చారు. వీరిలో ముగ్గురు ఐపీఎస్ అధికారులే. పోలీసు ఉన్నతాధికారులైన పి.సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా కూడా ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ముగ్గురిపై వేటు వేసింది.
ఈ కేసులో విద్యాసాగర్ ఏ1 కాగా, సీతారామాంజనేయులు ఏ2, కాంతిరాణా టాటా ఏ3, వెస్ట్ జోన్ గత ఏసీపీ హనుమంతరావు ఏ4, ఇబ్రహీంపట్నం గత సీఐ సత్యనారాయణ ఏ5, విశాల్ గున్నీ ఏ6గా ఉన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసు అధికారులు ప్రధాన నిందితుడు విద్యాసాగర్ తో కుమ్మక్కయినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.