Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు ఈ నెల 29 వరకు రిమాండ్... రాజమండ్రి జైలుకు తరలింపు
- బోరుగడ్డ అనిల్ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఓ వ్యక్తి నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్
- నేడు గుంటూరు కోర్టులో హాజరు
గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, పోలీసులు అతడిని గుంటూరు ఐదో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
న్యాయస్థానం అతడికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కర్లపూడి బాబు ప్రకాశ్ అనే వ్యక్తిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
అనిల్... తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడ్నని చెప్పుకునేవాడు. అతడి ఆఫీసులో టేబుల్ పై ఎంబీయే లండన్ అని నేమ్ ప్లేట్ కూడా ఉండేది. ముఖ్యంగా, జగన్ పేరు చెబుతూ దౌర్జన్యాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
జగన్ ను అన్నా అంటూ, తనది కూడా పులివెందుల అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ ఓ వెలుగు వెలిగాడు. విపక్ష నేతలపై తీవ్ర పదజాలంతో దూషించడం, మహిళలు అని కూడా చూడకుండా అభ్యంతరకర భాషతో తిట్లకు దిగేవాడు. లోకేశ్, పవన్ కల్యాణ్ లపై అతడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.