AP Govt: కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లపై నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం!
- సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్ల ఏర్పాటుపై నిషేధం విధిస్తున్నామని చెప్పిన మంత్రి నారాయణ
- ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని చేశాయన్న మంత్రి
- త్వరలో ఏపీలోనూ నిషేధానికి సంబంధించి చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పట్టణాల్లోని కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్ లు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించాలన్న ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
పట్టణ ప్రధాన రహదారి సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్ లు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని చేశాయని చెప్పిన మంత్రి నారాయణ.. త్వరలో మన రాష్ట్రంలో కూడా చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.