Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
- యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ధ్రువీకరించిన ఐడీఎఫ్
- హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ
- సిన్వర్ మృతి ప్రపంచానికి మంచిరోజన్న జో బైడెన్
అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇజ్రాయెల్‌లో 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న 2023 అక్టోబరు నాటి భయానక దాడులకు ప్రధాన సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ గురువారం సాయంత్రం ధ్రువీకరించింది.
"ఒక ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత, మా దళాలు హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, అనేక మంది ఇజ్రాయెల్ పౌరుల ఊచకోత, కిడ్నాప్‌కు కారణమైన ప్రధాన వ్యక్తి అయిన యాహ్యా సిన్వర్‌ను అంతమొందించాయి. నిన్న గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో అతనిని అంతమొందించిన దళాన్ని నేను ఇప్పుడు కలుసుకున్నాను" అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి గురువారం సాయంత్రం చెప్పారు.
అంతకుముందు గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని ఐడీఎఫ్ వెల్లడించింది. వారిలో యాహ్యా సిన్వర్ ఉండే అవకాశం ఉందని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకే సిన్వర్ మృతిని ఐడీఎఫ్ ధ్రువీకరించింది.
"అన్ని ప్రదేశాలలోనూ పనిచేస్తున్న ఐడీఎఫ్ దళాల ధైర్యం, సంకల్పం అతనిని అంతం చేసింది. మేము సిన్వర్‌ను చేరుకుంటామని చెప్పాం. ఇప్పుడు అది సాధించాం. అతను లేకుండా ప్రపంచం ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది" హెర్జి హలేవి అన్నారు.
ఈ ఏడాది జులైలో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌లో హతమార్చాయి. హనియే టెహ్రాన్‌లో హత్యకు గురైన తర్వాత హమాస్ రాజకీయ బ్యూరో అధిపతిగా సిన్వర్ నియమితులయ్యారు.
"మేము ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే వారందరినీ వెంబడించడం, నిర్మూలించడం కొనసాగిస్తాం. 7/10లో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ పట్టుకుని, అపహరణకు గురైన వారందరినీ ఇంటికి తిరిగి తెచ్చే వరకు మేము ఆగే ప్రశక్తే లేదు" అని ఐడీఎఫ్ చీఫ్ తెలిపారు.
ఇక హమాస్ చీఫ్ హత్య తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మొదటిసారి స్పందించారు. "ఈ రోజు చెడుకు భారీ దెబ్బ. కానీ మన ముందున్న పని ఇంకా పూర్తి కాలేదు" అని అన్నారు.
సిన్వర్ మృతి ప్రపంచానికి మంచిరోజు: జో బైడెన్
హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఆ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి మంచిరోజు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధ పరిసమాప్తికి బాటలు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అల్‌ఖైదా అధినేత, సెప్టెంబరు 11, 2001 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించిన ఘటనతో తాజా ఘటనను బైడెన్ పోల్చారు. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అయిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చెప్పారు.