Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ.. బెంగళూరు టెస్టులో అద్భుత ఇన్నింగ్స్

Sarfaraz Khan made century in Bangalore Test against New Zealand

 


భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అదరగొట్టాడు. బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత్ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అద్భుతమైన ఆట తీరుతో శతకాన్ని నమోదు చేశాడు. అజేయ సెంచరీతో ప్రస్తుతం క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

ఈ ఉదయం నాలుగవ రోజు ఆట మొదలైంది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగారు. 66 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 318 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 38 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 114, రిషబ్ పంత్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. టెస్ట్ కెరియర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ రెండవ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 35,  రోహిత్ శర్మ 52 ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కీలకమైన 70 పరుగులతో రాణించి ఔట్ అయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 401 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News