Giza Pyramid: గిజా పిరమిడ్ శిఖరానికి ఎక్కేసిన శునకం.. వీడియో తీసిన పారాగ్లైడర్.. తర్వాత జరిగింది ఇదీ.. వీడియో ఇదిగో!
- ప్రపంచంలోనే అతిపెద్దదైన గిజా పిరమిడ్ ఎక్కేసిన శునకం
- పిరమిడ్ మీదుగా వెళుతూ వీడియో తీసిన పారా గ్లైడర్
- పిరమిడ్ పైన పక్షులను వేటాడుతూ ఎంజాయ్ చేసిన శునకం
ఈజిప్షియన్ పిరమిడ్లలో అత్యంత పెద్దదైన గిజా పిరమిడ్‌ను ఓ శునకం ఎక్కేసింది. పిరమిడ్ మీదుగా ఎగురుతున్న పారా గ్లైడర్ మర్షల్ మోషర్ ఆ శునకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 448 అడుగుల ఎత్తుకు చేరుకున్న శునకం అక్కడ పక్షుల వేటలో మునిగిపోయింది. 25 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించి ఆశ్చర్యపోయారు.
జంతు ప్రేమికులు సైతం పిరమిడ్ ఎక్కిన శునకాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అంతపైకి ఎక్కింది సరే.. మళ్లీ కిందికి ఎలా దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిరమిడ్‌కు సమీపంలోనే చాలా శునకాలు నివసిస్తున్నాయని, వాటిలో ఒకటి ఇలా ఎక్కేసిందని చెబుతున్నారు. కాగా, ఈ వీడియో పోస్టు అయిన తర్వాతి రోజు శునకం దానంతట అదే కిందికి దిగుతున్నట్టున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.