Gold Rates: దీపావళికి ముందు పసిడి పరుగులు.. రికార్డు స్థాయిలో రూ. 80 వేలకు చేరువ
- అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్
- ఢిల్లీలో నిన్న రూ. 79,900గా నమోదు
- హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1,05,000
దీపావళికి ముందు బంగారం ధరలు భగ్గుమన్నాయి. పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 80 వేలకు చేరువైంది. స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో నిన్న రూ. 79,900గా నమోదైంది. గురువారంతో పోలిస్తే పది గ్రాముల పసిడిపై రూ. 550 పెరిగింది.
మరోవైపు, ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం జోరు కొనసాగింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను 10 గ్రాముల ధర రూ. 77,620 వద్ద నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్ ధర రికార్డు స్థాయిలో రూ. 77,667 పలికింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వర్ణం ధరపై రూ. 870 పెరిగి రూ. 78,980కు చేరుకుంది. అంతకుముందు ఇది రూ. 78,100గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 800 పెరిగి రూ. 72,400కు ఎగబాకింది.
బంగారంతో పాటు పెరిగే వెండి ధర భారీగానే పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి రూ. 94,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 2 వేలు పెరిగి రూ. 1,05,000కు ఎగబాకింది.