Rishabh Pant: బెంగళూరు టెస్టులో పంత్ రికార్డుల మోత... ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌ల రికార్డులు బద్దలు

Rishabh Pant Wicketkeeper batter has surpassed Kapil Dev and MS Dhoni in a major record list
  • టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు అందుకున్న భారత వికెట్ కీపర్‌గా అవతరణ
  • ఈ జాబితాలో ధోనీ రికార్డును బద్దలుకొట్టిన రిషబ్ పంత్
  • టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్‌ను దాటేసిన స్టార్ బ్యాటర్
టెస్ట్ క్రికెట్‌లో పునరాగమనం తర్వాత భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో సెంచరీ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ కదం తొక్కాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయ్యి... రెండో ఇన్నింగ్స్ లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఆడాడు. భారత రెండో ఇన్నింగ్స్ 83 ఓవర్లు ముగిసే సరికి అతడు 88 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో పంత్ ఇవాళ (శనివారం) రెండు కీలకమైన రికార్డులు నెలకొల్పాడు. 

ధోనీ రికార్డు బద్దలు..

టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని సాధించాడు. పంత్ కంటే ముందు వికెట్ కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీ 69 మ్యాచ్‌ల్లో 2,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ రికార్డును పంత్ చెరిపివేశాడు.

కపిల్ దేవ్‌ను దాటేసిన పంత్

బెంగళూరు టెస్టులో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో కపిల్‌ను వెనక్కినెట్టాడు. బెంగళూరు టెస్టులో నాలుగు సిక్సర్లు బాదడంతో ఆరవ స్థానానికి చేరాడు. కపిల్ దేవ్ 7వ స్థానానికి పడిపోయాడు.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీళ్లే...

1. వీరేంద్ర సెహ్వాగ్ - 90 సిక్సర్లు (178 మ్యాచ్‌లు)
2. రోహిత్ శర్మ - 88 సిక్సర్లు (107 మ్యాచ్‌లు)
3. ఎంఎస్ ధోనీ - 78 సిక్సర్లు (144 మ్యాచ్‌లు)
4. సచిన్ టెండూల్కర్ - 69 సిక్సర్లు (329 మ్యాచ్‌లు)
5. రవీంద్ర జడేజా - 66 సిక్సర్లు (108 మ్యాచ్‌లు)
6. రిషబ్ పంత్ - 63 సిక్సర్లు ( 62 మ్యాచ్‌లు)
7. కపిల్ దేవ్ - 61 సిక్సర్లు (184 మ్యాచ్‌లు).
Rishabh Pant
India vs New Zealand
Cricket
MS Dhoni
Kapil Dev

More Telugu News