Omar Abdullah: మా పార్టీని అందరూ ముస్లిం పార్టీ అనుకుంటారు... కానీ..!: ఒమర్ అబ్దుల్లా
- నేషనల్ కాన్ఫరెన్స్ ముస్లింల పార్టీ కాదన్న ఒమర్ అబ్దుల్లా
- జమ్మూకశ్మీర్ కు చెందిన ప్రజలందరికీ సేవ చేస్తుందని వ్యాఖ్య
- హిందూ నేతను డిప్యూటీ సీఎం చేశామన్న ఒమర్
తమ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ను అందరూ ముస్లిం పార్టీ అనుకుంటారని... అది నిజం కాదని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్ము ప్రాంతానికి చెందిన హిందూ నేతను (సురీందర్ కుమార్ చౌదరి) తాము డిప్యూటీ సీఎం చేశామని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం కశ్మీర్ కు చెందిన పార్టీ అనే ఆరోపణలను ఆయన ఖండించారు. తమ పార్టీ జమ్మూకశ్మీర్ కు చెందిన ప్రజలందరికీ సేవ చేస్తుందని చెప్పారు.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అభ్యర్థులను జమ్ము ప్రజలు ఎక్కువగా ఎన్నుకోకపోవడంతో... ఆ ప్రాంతాన్ని తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎన్నికల తర్వాత ప్రచారం చేశారని... కానీ, తాము జమ్ముకు చెందని హిందువును డిప్యూటీ సీఎం చేశామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేశాయి. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత... ఒమర్ అబ్దుల్లా తొలి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.