Chandrababu: 420లకు నా విజన్ అర్థంకాదు: సీఎం చంద్రబాబు
- రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభం
- సీఆర్డీయే కార్యాలయ పనులకు ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు
- అమరావతికి లక్ష కోట్లు ఖర్చవుతుందని తప్పుడు ప్రచారం చేశారంటూ ఆగ్రహం
గత ఐదేళ్లుగా మూలనపడిన రాజధాని అమరావతి పనులు నేడు మళ్లీ పట్టాలెక్కాయి. సీఆర్డీయే కార్యాలయ పనులకు ప్రారంభోత్సవం చేయడం ద్వారా సీఎం చంద్రబాబు అమరావతి పునర్ నిర్మాణానికి నేడు తెరలేపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశామని వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని వెల్లడించారు. 2000 సంవత్సరం కంటే ముందు విజన్ 2020 అంటే ఎగతాళి చేసి 420 అన్నారు... కానీ విమర్శించిన వాళ్లే 420 లు అయ్యారని ఎద్దేవా చేశారు.
"నా విజన్ ఏంటో 420 లకు అర్థం కాదు... తెలీదు. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రగామిగా ఉండాలన్నది నా ధ్యేయం. మీ ఆదాయాలు పెంచుతాం. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి. ఒకప్పుడు థింక్ గ్లోబల్...యాక్ట్ లోకల్ అనే నినాదం ఉండేది. ఇప్పుడు థింగ్ గ్లోబల్...యాక్ట్ గ్లోబల్ గా ఉండాలి" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
లక్ష కోట్టు ఖర్చు అంటూ తప్పుడు ప్రచారం
రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతాయని... తమ వద్ద డబ్బులేదని ఐదేళ్లపాటు కాలయాపన చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. హైదరాబాద్ లో కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు...భూమి ఇచ్చి నీళ్లు ఇచ్చాం. దీంతో అక్కడ సంపద సృష్టి జరిగింది. ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతి అభివృద్ధి చేస్తాం.
అమరావతిని పట్టుకుని శ్మశానం, ఎడారి, మునిగిపోయిందని మాట్లాడుతున్నారు. వర్షాలకు చెన్నై, హైదరాబాద్ లో నీళ్లొచ్చాయి. బెంగళూరులో జగన్ కట్టుకున్న యలహంక ప్యాలెస్ లోకి నీళ్లు వచ్చాయి. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు కూడా క్షమించడు.
పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి
అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్ గా జరుగుతున్నాయి. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తాం. రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి. ప్రజలు గెలవాలి...రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చా.
సుందర నగరంగా అమరావతి నిర్మాణం
1,631 రోజులు పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారు. విధ్వంసం పోయింది... నిర్మాణం ప్రారంభమైంది. విధ్వంసం శాశ్వతం కాదు... అరాచకం శాశ్వతం కాదు... మనం చేసే మంచి పనులే శాశ్వతం. అమరావతిలో గత పాలకులు చేసిన విధ్వంసంతో నిలిచిన పనుల వల్ల రూ.7 వేల కోట్లు అదనంగా భారం పడుతోంది. రూ.52 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.15 వేల కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్నది నా కల. కష్టాలు చూసి పారిపోయేవాడిని కాదు.