VHP: వీహెచ్పీ ఆధ్వర్యంలో జనవరి 5న హైందవ శంఖారావం బహిరంగ సభ
- దేవాలయాల వ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని వీహెచ్పీ నేత డాక్టర్ సురేంద్రజైన్ ఆవేదన
- టీటీడీ సహా ఇతర దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్
- హిందువుల మనోభావాలు, సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వినతి
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రజైన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలే కాకుండా.. దేవాలయాల వ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు, సమస్యలను ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఏడాది జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలయాల్లో భక్తులు సమర్పించే ముడుపులు అధికారులు, పాలక మండళ్ల ద్వారా దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
టీటీడీ సహా ఇతర దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించనున్నట్టు సురేంద్రజైన్ తెలిపారు.