YCP MLC: తిరుమల బ్రేక్ దర్శనానికి రూ. 65 వేలు వసూలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
-
వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనం కోసం డబ్బులు వసూలు చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు జకియాపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని ఆరుగురి నుంచి రూ. 65 వేలు వసూలు చేసినట్టు ఆరోపించారు. టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్సీ తమ చేతిలో సిఫార్సు లేఖ పెట్టారని పేర్కొన్నారు.
భక్తుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియాఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేసి ఆరోపణలు నిర్ధారణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ జకియాఖానంతో వైసీపీకి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు.