Group-1: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన... హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత
- తెలంగాణలో అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్
- జీవో 29 రద్దు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు
- తీర్పు వచ్చే వరకు మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్
అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వచ్చే వరకు గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే, ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండగా, గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాదులో అశోక్ నగర్ లో ఇప్పటికే ఆందోళన కూడా చేపట్టారు. వారికి బండి సంజయ్, హరీశ్ రావు వంటి విపక్ష నేతలు కూడా మద్దతు పలికారు.
తాజాగా, అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.