Rishab pant: ఇన్‌స్టాగ్రామ్‌లో రిషబ్ పంత్ ఆసక్తికర పోస్ట్
- కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమమన్న స్టార్ బ్యాటర్
- మనుషుల్ని దేవుడినే చూడనిద్దామంటూ వ్యాఖ్య
- పంత్ ఉద్దేశం ఏమిటంటూ ఆరా తీస్తున్న అభిమానులు
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి అనంతరం స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నిగూడార్థంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమం. మనుషుల్ని దేవుడినే చూడనిద్దాం’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో పంత్ పెట్టిన పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టుపై ఆరా తీస్తున్నారు.
ఇక ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టిన రిషబ్ పంత్.. బెంగళూరు టెస్టులో టీమిండియాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో పుంజుకుంటామని చెప్పాడు. బెంగళూరు ప్రేక్షకులు అద్భుత రీతిలో మద్దతు అందించారని, ప్రేమాభిమానాలు చూపించారని పంత్ హర్షం వ్యక్తం చేశాడు. అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని, తాము తిరిగి బలంగా పుంజుకుంటామని పంత్ పేర్కొన్నాడు. ‘‘ ఈ ఆట మీ పరిమితులకు పరీక్ష పెడుతుంది. పడగొడుతుంది, పైకి లేపుతుంది. మళ్లీ వెనక్కి విసిరేస్తుంది. అయితే ఈ ఆటను ఇష్టపడేవారు ప్రతిసారీ దృఢంగా తయారవుతారు’’ అని పేర్కొన్నాడు.
కాగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన నేపథ్యంలో రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ పుంజుకోవడంలో రిషబ్ పంత్ తనవంతు పాత్ర పోషించాడు. 99 పరుగులతో తను రాణించిన విషయం తెలిసిందే.