CJI Chandrachud: పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించాను.. అయోధ్య వివాదం తీర్పుపై సుప్రీం సీజే చంద్రచూడ్

CJI DY Chandrachud said he had prayed to God for a solution to the Ayodhya dispute
  • వివాదానికి పరిష్కారం కోసం దైవం ముందు కూర్చున్నానాన్న చీఫ్ జస్టిస్  
  • నమ్మకం ఉంటే దేవుడే మార్గం చూపిస్తాడన్న సీజే 
  • స్వగ్రామంలో సత్కార కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్య తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. నమ్మకం ఉంటే దేవుడే దారి చూపుతాడని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం కన్హెర్సర్‌లో జరిగిన సత్కార కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు.

‘‘ తరచుగా మేము తీర్పు చెప్పాల్సిన కేసులు ఉంటాయి. కానీ మేము ఒక పరిష్కారానికి రాలేము. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ వివాదం మూడు నెలలపాటు నా ముందు ఉంది. నేను దైవం ముందు కూర్చున్నాను. నేను ఒక పరిష్కారాన్ని చూపించాల్సి ఉందని దేవుడితో చెప్పాను’’ అని చంద్రచూడ్ వివరించారు. తాను నిత్యం దేవుడిని పూజిస్తానని చంద్రచూడ్ చెప్పారు. ‘‘ మీకు నమ్మకం ఉంటే దేవుడే ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని చూపిస్తాడు’’ అని ఈ సందర్భంగా అన్నారు.

కాగా నవంబర్ 9, 2019న నాటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇక అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన ఈ ధర్మాసనంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది జులైలో అయోధ్య రామాలయాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
CJI Chandrachud
Ayodhya
Supreme Court

More Telugu News