Rohit Sharma: బెంగళూరు టెస్టు ఓటమితో రోహిత్ ఖాతాలో అవాంఛిత రికార్డు
- కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మూడవ టెస్ట్ మ్యాచ్ పరాజయం
- అత్యధిక టెస్ట్ ఓటములు చవిచూసిన మూడవ భారతీయ కెప్టెన్‌గా నిలిచిన హిట్‌మ్యాన్
- ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీలతో సమానంగా నిలిచిన రోహిత్
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో స్వదేశంలో భారత్‌కు రెండవ టెస్ట్ ఓటమి ఎదురైంది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విధంగా స్వదేశంలో ఒక క్యాలెండర్ ఏడాదిలో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడిపోవడం గత 12 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. 2024కి ముందు 2012లో భారత్ ఈ విధంగా స్వదేశంలో రెండు టెస్ట్ మ్యాచ్ ఓటములు చవిచూసింది.
ఇదిలావుంచితే బెంగళూరు టెస్ట్ ఓటమితో రోహిత్ శర్మ ఖాతాలో అవాంఛిత రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది మూడవ టెస్టు పరాజయం. దీంతో అత్యధిక ఓటములు చవిచూసిన మూడవ భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, బిషన్ సింగ్ బేడీలతో ఉమ్మడిగా ఈ రికార్డును పంచుకున్నాడు. కాగా ఈ అవాంఛిత రికార్డుల జాబితాలో 9 పరాజయాలతో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా 1988 తర్వాత అంటే దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. భారత గడ్డపై న్యూజిలాండ్ ఇప్పటివరకు 37 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా ఇది మూడవ విజయం. 1969లో నాగ్‌పూర్‌లో తొలి విజయాన్ని, 1988లో వాంఖడే స్టేడియంలో రెండవ గెలుపును సాధించింది.