Chandrababu: రౌడీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. జగన్ పై విమర్శలు!
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న చంద్రబాబు
- రాష్ట్ర ప్రగతిలో పోలీసులది కీలక పాత్ర అని వ్యాఖ్య
- రౌడీల తాట తీస్తామని హెచ్చరిక
- ప్రతి కేసును సవాల్ గా తీసుకుంటామన్న ముఖ్యమంత్రి
- జగన్ రూ. 12 కోట్లతో ఇంటికి కంచె వేసుకున్నారని మండిపాటు
శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు అవుతుందని రౌడీలను హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజంను ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా చంద్రబాబు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని... వారంతా ప్రజల హృదయాలలో త్యాగధనులుగా నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటం కోసం పోలీసులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. పోలీసుల శ్రమను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సీఎం అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వాహనాలు, పరికరాలు, సాంకేతిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో పోలీసు శాఖ కోసం రూ. 600 ఖర్చు చేశామని తెలిపారు. కొత్త వాహనాల కోసం రూ. 60 కోట్లు వెచ్చించామని చెప్పారు. రూ. 27 కోట్లతో ఏపీఎఫ్ఎస్ఎల్ పరికరాలు కొనుగోలు చేశామని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి రూ. 55 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఏపీ పోలీసు అంటే దేశానికే మోడల్ గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని... ప్రతి కేసును సవాల్ గా తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడబిడ్డల రక్షణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని చెప్పారు. అమరావతిలో అమరవీరుల సంస్మరణ స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇకపై జీరో క్రైమ్ నమోదు కావాలని అన్నారు.
రాష్ట్రంలో నేరాల తీరు మారుతోందని సీఎం చెప్పారు. నేరస్తుల కంటే పోలీసుల వద్ద ఎక్కువ టెక్నాలజీ ఉంటేనే వారిని కట్టడి చేయగలమని అన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలు ఇష్టానుసారం వ్యవహరిస్తే వారి తాట తీస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, ఎర్రచందనం, మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్ సర్వే రాళ్ల కోసం రూ. 700 కోట్లు వృథా ఖర్చు చేశారని విమర్శించారు. రూ. 12 కోట్లతో ఇంటికి కంచె ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం పోలీసులకు సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.