Rishabh Pant: రెండో టెస్టులో రిషబ్ పంత్ ఆడడా?.. తెరపైకి ఆసక్తికర విషయం

A Report said that selectors have left the decision to the team management over Pant ahead of the 2nd test
  • పంత్‌ను ఆడించాలా? వద్దా? అన్నది జట్టు మేనేజ్‌మెంట్‌కే వదిలేసిన సెలక్టర్లు
  • పంత్‌ను ఆడించకుంటే ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కే ఛాన్స్
  • తొలి టెస్టులో మోకాలి గాయానికి గురైన రిషబ్ పంత్
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మోకాలి గాయానికి గురైన విషయం తెలిసిందే. మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన ప్రదేశంలోనే బంతి తగలడంతో కాలు వాచింది. దీంతో తొలి టెస్ట్ రెండవ రోజున పంత్ మైదానాన్ని వీడాడు. మూడవ రోజు కూడా ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్థానంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. అయితే నాలుగవ రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అదరగొట్టాడు. అత్యంత కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 

కాగా పుణే వేదికగా గురువారం మొదలుకానున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో పంత్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. రెండవ టెస్టులో పంత్‌ను ఆడించాలా? వద్దా? అన్నది జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయానికే సెలక్టర్లు వదిలేశారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఒకవేళ రెండవ టెస్టుకు పంత్ దూరమైతే ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో నమ్మదగిన ఆప్షన్‌గా ఉన్న జురెల్‌ను జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించే అవకాశం ఉందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది.

కాగా న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్ట్ ఓటమి అనంతరం రిషబ్ పంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆటలో హెచ్చు తగ్గులు ఉంటాయని, అయితే ఇబ్బందులు ఎదురైన ప్రతిసారీ బలంగా ఎదగడం ముఖ్యమని చెప్పాడు. మరి రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పంత్ ఆడతాడో లేదో అనేది వేచిచూడాల్సి ఉంది.
Rishabh Pant
Cricket
Team India
India Vs New Zealand

More Telugu News