TDP Office Attack: టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- ఈ రెండు కేసులను నేడు విచారించిన న్యాయస్థానం
- రిజాయిండర్ దాఖలుకు సమయం కావాలని నిందితుల విజ్ఞప్తి
- డిసెంబర్ 17కు విచారణ వాయిదా
- అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి నివాసంపై దాడి కేసుల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 17కు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం నేడు ఈ కేసులను విచారించింది. ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా పలువురి పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
దీంతో వాటికి రిజాయిండర్ దాఖలు చేస్తామని, అందుకు కొంత సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.