AP Drone Summit: రేపు డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Chandrababu and Ram Mohan Naidu will ianugurate Drone Summit tomorrow
  • అమరావతిలో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్
  • వివరాలు వెల్లడించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి
  • ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ లక్ష్యమని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతిలో రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేశ్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరిస్తారని తెలిపారు. 

ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ లక్ష్యమని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ డ్రోన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు 6,929 మంది తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని... డెలిగేట్స్, డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్, స్పీకర్స్ విభాగాల్లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారని వివరించారు. హ్యాకథాన్ లోని నాలుగు కేటగిరీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని సురేశ్ కుమార్ తెలిపారు. 

ఈ సమ్మిట్ లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ఎంవోయూలు కుదుర్చుకుంటుందని అన్నారు. డ్రోన్ పైలెట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం ఉంటుందని, తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్ గా చేర్చుకుంటూ మరో ఒప్పందం ఉంటుందని అన్నారు. నవంబరు చివరి వారం నాటికి డ్రోన్ పాలసీకి తుది రూపునిస్తామని చెప్పారు. 

రేపు సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ బెరం పార్కులో డ్రోన్ షో ఉంటుందని సురేశ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. 

ప్రస్తుతం వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో డ్రోన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. డ్రోన్ల పరిశోధన, ఉత్పత్తి, టెస్టింగ్, వినియోగంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.
AP Drone Summit
Chandrababu
Kinjarapu Ram Mohan Naidu
Amaravati
Andhra Pradesh

More Telugu News