OnePlus: ‘గ్రీన్ లైన్’ సమస్య ఎదుర్కొంటున్న వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌న్యూస్

Display will be replaced at no cost for Green line issue says OnePlus
  • ఉచితంగా డిస్‌ప్లే మార్చుతామని ప్రకటించిన కంపెనీ
  • సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని సూచన
  • గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ యూజర్లు
వన్‌ప్లస్ కంపెనీకి చెందిన పలు మోడల్ స్మార్ట్‌ఫోన్లలో ‘గ్రీన్ లైన్’ సమస్య తలెత్తుతున్న విషయం తెలిసింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఫోన్ డిస్‌ప్లే మీద ఆకుపచ్చ రంగులో సన్నటి గీత వచ్చింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల యూజర్లకు ఈ సమస్య ఎదురవుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది యూజర్లు ఈ సమస్యపై ఫిర్యాదులు చేశారు. దీంతో ‘గ్రీన్ లైన్’ సమస్యపై వన్‌ప్లస్ కంపెనీ కీలక ప్రకటన చేసింది.

‘గ్రీన్ లైన్’ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు సమీపంలోని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని కంపెనీ సూచించింది. ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా డిస్‌ప్లేలను మార్చుతామని తెలిపింది. వారెంటీ ముగిసిన ఫోన్లకు ఈ సర్వీసు వర్తిస్తుందని వెల్లడించింది. ఫోన్ల ప్రదర్శన విషయంలో జీవితకాల వారెంటీని ఇస్తున్నట్టు తెలిపింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్‌లోని ఎంపిక చేసిన పలు మోడల్‌ ఫోన్లను ఈ సమస్య ప్రభావితం చేస్తుందని పేర్కొంది. కాగా ఈ గ్రీన్ లైన్ సమస్య వన్‌ప్లస్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాలేదు. సామ్‌సంగ్, మోటరోలా, వివో స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 31న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.
OnePlus
OnePlus Smartphones
Green line issue
Tech-News

More Telugu News