sabarimala yatra: సికింద్రాబాద్ నుంచి శబరిమలకు భారత్ గౌరవ్ రైలు... వివరాలు ఇవిగో!
- శబరిమల భక్తుల కోసం భారత్ గౌరవ్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఆర్‌సీటీసీ
- నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకూ శబరిమల యాత్రకు ప్రత్యేక ట్రైన్
- శబరిమల యాత్ర ప్రత్యేక ట్రైన్ బ్రోచర్‌ను విడుదల చేసిన దక్షణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్‌కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ ట్రైన్ వివరాలు వెల్లడించారు.
శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం, ఎర్నాకుళం చొటానిక్కర్ అమ్మవారి ఆలయాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న ఈ ట్రైన్ లో సికింద్రాబాద్, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు. రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్‌లలో ప్రయాణీకులు ఎక్కే అవకాశం కల్పించారు.
నవంబర్ 16న ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక ట్రైన్ సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూరుకు చేరుకుంటుంది. అక్కడ దిగిన తరువాత రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నీలక్కళ్ నుండి చోటానిక్కర (ఎర్నాకులం) వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7 గంటలకు చోటానిక్కర్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని .. రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఎర్నాకులం టౌన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇక ప్యాకేజీ వివరాలకు వస్తే .. ఎకానమీ కేటగిరిలో ఒక్కో టికెట్ ధర రూ.11,475, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.10,655లు చెల్లించాలి. స్టాండర్డ్ (3ఏసీ) కేటగిరీలో రూ.18,790లు, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.17,700లు చెల్లించాలి. కంఫర్ట్ (2ఏసీ) కేటగిరీలో రూ.24,215లు, 5- 11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.22,910లు చెల్లించాలి. ప్రయాణీకులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బంది ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలి.