Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేసే పోలీసు అధికారికి రూ. 1.11 కోట్లు ఇస్తాం: కర్ణిసేన చీఫ్
- ఇటీవల ఎన్సీపీ నేత సిద్ధిఖీని హతమార్చిన బిష్ణోయ్ గ్యాంగ్
- 2023లో కర్ణిసేన చీఫ్ ను కాల్చి చంపిన వైనం
- సల్మాన్ ఖాన్ కు కూడా బెదిరింపులు పంపుతున్న బిష్ణోయ్ గ్యాంగ్
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చంపిన ఏ పోలీసు అధికారికైనా రూ. 1,11,11,111 బహుమతిగా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ బహిరంగ ప్రకటన చేశారు. తమ అమరవీరుడు సుఖ్ దేవ్ సింగ్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ కారణమని ఆయన అన్నారు. సబర్మతి జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు సంబంధించి కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలపై షెకావత్ అసహనం వ్యక్తం చేశారు.
2023 డిసెంబర్ 5న అప్పటి కర్ణిసేన చీఫ్ అయిన సుఖ్ దేవ్ సింగ్ ను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే... హత్యకు తామే కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
సరిహద్దుల వద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్ అరెస్ట్ అయ్యాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం ఎదుట కాల్పులు జరిపింది కూడా బిష్ణోయ్ గ్యాంగే. ఇటీవల జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు తామే కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.