Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌కు ముందు ఆసక్తికర పరిణామం.. బయటపెట్టిన సంజూ శాంసన్
- ఫైనల్‌కు సిద్ధంగా ఉండాలని శాంసన్‌కు సూచించిన కెప్టెన్ రోహిత్ శర్మ
- మార్పులు లేకుండానే బరిలోకి దిగాలని టాస్కు కొన్ని నిమిషాల ముందు నిర్ణయం
- రోహిత్ తన వద్ద విషయాన్ని వెల్లడించాడన్న సంజూ శాంసన్
ఈ ఏడాది జూన్ నెలలో భారత్ జట్టు గెలుచుకున్న టీ20 ప్రపంచ కప్ 2024 సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టుతోనే ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. చక్కటి ఫామ్‌లో ఉన్న శాంసన్ కన్నా.. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషబ్ పంత్‌పైనే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో తనను ఆడించాలని భావించారని శాంసన్ వెల్లడించాడు. ఇదే విషయాన్ని ఫైనల్ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు చెప్పాడని, టైటిల్ పోరుకు సిద్ధంగా ఉండాలని కోరాడని, అయితే టాస్కు కొద్ది నిమిషాల ముందు అంతా మారిపోయిందని వివరించాడు.
మార్పులు లేకుండా సెమీ ఫైనల్లో ఆడిన జట్టునే కొనసాగించాలని భావిస్తున్నట్టు రోహిత్ చెప్పాడని శాంసన్ అన్నాడు. రోహిత్ తన వద్దకు వచ్చి విషయం చెప్పేవరకు తాను ఫైనల్ ఆడేందుకు సన్నద్ధమవుతూ ఉన్నానని పేర్కొన్నాడు. చోటు దక్కకపోయినప్పటికీ బాధపడలేదని, అప్పుడు ఆ భావనలో ఉన్నానని వివరించాడు. జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంసన్ ఈ విషయాలను పంచుకున్నాడు. కాగా ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్టుని నిర్ణయించిన తర్వాత జట్టు నిర్ణయాన్ని శాంసన్‌కు వివరిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సమయం గడిపాడు. ఆ సమయంలో జరిగిన సంభాషణను కూడా శాంసన్ పంచుకున్నాడు.
‘‘వార్మప్ సమయంలో రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. నన్ను ఎందుకు ఆడించడం లేదో కారణాన్ని చెప్పడం రోహిత్ మొదలుపెట్టాడు. నీకు అర్థమైందా అని అడిగాడు. చాలా సాధారణంగా ఈ విషయాన్ని చెప్పాడు. అయితే మనం సాధిద్దాం అని రోహిత్‌తో చెప్పాను. మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడండి. ముందు మీరు మ్యాచ్‌పై దృష్టి పెట్టండి అని చెప్పాను’’ అని శాంసన్ గుర్తు చేసుకున్నాడు.