Y Sathya Kumar: నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్ పై మరో ఫిర్యాదు
- ప్రస్తుత మంత్రి సత్యకుమార్ పై గతంలో దాడి జరిగిందన్న బీజేపీ నేతలు
- అమరావతి రైతులకు మద్దతు పలికేందుకు వెళ్లిన సత్యకుమార్
- నందిగం సురేశ్, ఇతర వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణ
- బోరుగడ్డ అనిల్ ఫోన్ లో సత్యకుమార్ ను బెదిరించారని వెల్లడి
- గతంలో పోలీసులు పట్టించుకోలేదన్న బీజేపీ నేతలు
- తాజాగా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు
ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, జగన్ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ పై మరో ఫిర్యాదు అందింది. వీరిద్దరిపై బీజేపీ నేతలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ పై గతంలో వైసీపీ నేతలు దాడి చేశారని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
2023 మార్చి 31న అమరావతి రైతు ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు సత్యకుమార్, ఇతర నేతలు రాజధాని ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ మూడు రాజధానుల అనుకూల శిబిరం కూడా నడుస్తోంది. ఆ శిబిరం వద్ద సత్యకుమార్ పై దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.
అమరావతి రైతులకు మద్దతు ఇస్తావా అంటూ సత్యకుమార్ పై నందిగం సురేశ్, ఇతర వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు వివరించారు. అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తూ, కర్రలు, రాళ్లతో దాడి చేశారని వెల్లడించారు.
మరోవైపు, బోరుగడ్డ అనిల్ ఫోన్ లో సత్యకుమార్ పై బెదిరింపులకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ బెదిరించాడని ఆరోపించారు. సోషల్ మీడియాలో దారుణమైన పదజాలంతో దూషించాడని తెలిపారు.
ఈ ఘటనలపై సత్యకుమార్ గతంలోనే మంగళగిరి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని, కానీ అప్పటి పోలీసులు కేసు నమోదు చేయలేదని బీజేపీ నేతలు వెల్లడించారు. ఇప్పటికైనా నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.