Cyclone Dana: దానా ఎఫెక్ట్.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్ల క్యాన్సిల్!
- 'దానా' తుపాను కారణంగా తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్ల రద్దు
- ఈ మేరకు వాల్తేర్ సీనియర్ డీసీఎం ప్రకటన
- 23న 18 రైళ్లు.. 24న 37 రైళ్లు.. 25న 11 రైలు సర్వీసులు క్యాన్సిల్
దానా తుపాను నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ వెల్లడించారు. ఇందులో భాగంగా 23వ తేదీన ఏకంగా 18 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
క్యాన్సిల్ అయిన రైలు సర్వీసుల్లో బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హావ్‌డా ఈస్ట్‌కోస్టు, కన్యాకుమారీ-డిబ్రూఘర్ కన్యాకుమారీ, సికింద్రాబాద్-హావ్‌డా ఫలక్‌నుమా, ముంబయి-భువనేశ్వర్ కోణార్క్, చెన్నై సెంట్రల్-హావ్‌డా మెయిల్ తదితర రైళ్లు ఉన్నాయి.
ఇక 24న 37 రైళ్లు రద్దయ్యాయి. వాటిలో భువనేశ్వర్-విశాఖ వందేభారత్, షాలిమార్-వాస్కోడిగామా అమరావతి ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్, హావ్‌డా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా, పట్నా-ఎర్నాకుళం తదితర రైలు సర్వీసులు ఉన్నాయి.
25న విశాఖ-బ్రహ్మపుర, విశాఖ-అమృత్సర్, విశాఖ-గుణుపూర్, విశాఖ-భువనేశ్వర్ తదితర 11 రైళ్లను క్యాన్సిల్ చేశారు.