Indian Railways: రైలు ప్రయాణికులకు షాకింగ్ వార్త.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట!

Blankets in AC Trains are Washed Only Once a Month Railway Shocking Reply
  • పిల్లో కవర్, బెడ్‌షీట్‌ను మాత్రం రైలు జర్నీ పూర్తయిన ప్రతిసారి ఉతుకుతారు 
  • దుప్పట్లను మాత్రం చక్కగా మడతపెట్టి మళ్లీ సిద్ధం చేస్తారట
  • మురికిగా మారినప్పుడు, వాసన వస్తున్నప్పుడే లాండ్రీకి పంపుతారట
  • ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే విస్తుపోయే సమాధానం
రైలులోని ఏసీ బోగీలో ప్రయాణించేటప్పుడు ఈసారి సొంత దుప్పటి తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే రైలు ప్రయాణంలో ఇచ్చే దుప్పటిని నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. అంటే అప్పటికి అది వేలాదిమంది ఒంటిపై నాట్యం చేస్తుందన్నమాటే. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లను ఎన్ని రోజులకు ఉతుకుతారంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే ఇలా విస్తుపోయే సమాధానం ఇచ్చింది.

రైలులోని ఏసీ ప్రయాణికులకు నీట్‌గా ప్యాక్ చేసి ఓ కవర్‌లో పెట్టిన దుప్పటి, బెడ్‌షీట్, తలగడను రైల్వే అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తాయి. నిజానికి ఇది తప్పని తాజాగా తేలిపోయింది. బెడ్‌షీట్, పిల్లో కవర్‌ను మాత్రం ఉపయోగించిన ప్రతిసారీ ఉతుకుతారట. కానీ, దుప్పట్లను మాత్రం నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే వాష్ చేస్తారట. అంటే ఆ దుప్పటి ఎంతోమంది ప్రయాణికుల శరీరాలను వెచ్చబరిచిన అనంతరం మన వద్దకు వస్తుందన్నమాట. అయితే, దురంతో, గరీభ్‌రథ్ వంటి రైళ్లలో అదనంగా డబ్బులు చెల్లించి బెడ్డింగ్ సర్వీసును ఉపయోగించుకునే వీలుంది.

ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే ఇచ్చిన సమాధానం ప్రకారం.. రైలు జర్నీ పూర్తయిన తర్వాత పిల్లో కవర్, బెడ్‌షీట్‌ను లాండ్రీకి పంపిస్తారు. కానీ, దుప్పట్లను మాత్రం మళ్లీ చక్కగా ప్యాక్‌ చేసి సిద్ధంగా ఉంచుతారు. అవి మురికిగా కనిపించినా, వాసన వస్తున్నా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తారట. కాగా, ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2017లో తన నివేదికలో హెచ్చరించింది. రైలులో అందించే దుప్పట్లను కొన్నిసార్లు ఆరు నెలల వరకు ఉతకడం లేదని పేర్కొంది. సో.. ఈసారి రైలు ప్రయాణంలో దుప్పటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
Indian Railways
AC Coach
Bed Sheets
Blankets
Pillow Covers

More Telugu News