Fake Court: మోసాలకే పరాకాష్ఠ.. నకిలీ కోర్టు పెట్టి జడ్జిగా అవతారమెత్తి తీర్పులిచ్చేశాడు!
- గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన
- కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ ట్రైబ్యునల్ ఏర్పాటు
- సివిల్ కోర్టులో పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎర
- త్వరగా తీర్పులిస్తానంటూ డబ్బుల వసూలు
- ప్రభుత్వ భూమికి సంబంధించి తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు
- అవి నకిలీవని గుర్తించడంతో కటకటాలపాలు
ఇది మోసాలకే మోసం. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రైబ్యునల్‌నే ఏర్పాటు చేసి తీర్పులు కూడా ఇచ్చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ గాంధీనగర్‌లోని తన కార్యాలయాన్ని కోర్టు రూముగా మార్చేశాడు. 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చి ఆదేశాలు జారీచేశాడు.
అయితే, అవి నకిలీ ఆదేశాలని గుర్తించిన అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కోర్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఐదేళ్లుగా అతడు ఇలా తీర్పులు ఇస్తున్నట్టు గుర్తించారు.
సివిల్ కోర్టులో పెండింగ్ కేసులున్న వారిని గుర్తించి వాటిని త్వరగా పరిష్కరిస్తానని నిందితుడు తన కోర్టుకు రప్పించుకునేవాడు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పులిస్తూ పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది. తనది నిజమైన కోర్టుగా నమ్మించేందుకు తన అనుచరులను కోర్టు సిబ్బందిగా ఉపయోగించుకున్నట్టు పోలీసులు తెలిపారు.