Galla Madhavi: జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం
- సీఎంగా పని చేసిన వ్యక్తి శవాల చుట్టూ రాజకీయం చేయడం దారుణమన్న ఎమ్మెల్యే
- ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
- మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్న మాధవి
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి శవాల చుట్టూ రాజకీయం చేయడం దారుణమని, ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు హాస్యాస్పదమన్నారు. మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. హోంమంత్రి స్వయంగా బాధితుల వద్దకు వెళుతున్నారని తెలిపారు.
జగన్, ఆయన పార్టీ నాయకులు కేవలం ప్రభుత్వంపై బురద జల్లేందుకే పని చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, మొదట అక్కడ ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. జగన్ శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
జగన్‌పై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా పరామర్శకు వెళ్లారా? అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై ఆయన నోరు మెదపలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక సొంత బాబాయి వైఎస్ వివేకానంద హత్య గురించి కూడా మాట్లాడలేదన్నారు. జగన్ అయిదేళ్ల పాటు నేరపూరిత ఆలోచనలతో పాలన సాగించారని విమర్శించారు.
కానీ ఇప్పుడు పరామర్శల పేరుతో బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరద బాధితుల కోసం రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్ ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. అరాచకాలు చేస్తే, మహిళలపై దారుణాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.