YS Jagan: తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే... బిగ్ ఎక్స్పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్
- జగన్‌కు షర్మిల రాసిన లేఖ వివరాలను ట్వీట్ చేసిన టీడీపీ
- తల్లి, చెల్లి కలిసి కన్నీళ్లతో సైకోకు రాసిన లేఖ అంటూ చురక
- అన్న కోసం చెల్లి ఆస్తులు వదులుకుంటే.. తల్లి, చెల్లి పైనే కేసులు పెట్టాడని మండిపాటు
'ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీటితో ఓ సైకోకు రాసిన లేఖలోని మొదటి భాగం' అంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అంతకుముందు, "బిగ్ ఎక్స్పోజ్, 24 అక్టోబర్ మధ్యాహ్నం 12 గంటలకు" అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కాసేపటి క్రితం రేపు కాదు... ఈరోజే ఆ సంచలనాన్ని వెలుగులోకి తెస్తున్నామని మరో ట్వీట్ చేసింది. ఆ తర్వాత షర్మిల, విజయమ్మ... జగన్‌కు రాసిన లేఖ అంటూ వరుస ట్వీట్లు చేసింది. జగన్‌కు 12 సెప్టెంబర్ 2024న లేఖ రాసినట్లుగా తేదీ ఉంది.
చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలోని ఏ జీవిని చూసినా తల్లి తర్వాతేనని, జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుందని, కానీ ఈ కన్నీటి లేఖ (షర్మిల, విజయమ్మ)ను చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఓ వింత సైకో గురించి తెలుసుకుంటారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొంది.
ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ అనే సైకో ఎలా వేధిస్తున్నాడో... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ... కన్నీళ్ళతో, సైకో జగన్‌కి చెల్లి షర్మిల లేఖ రాశారని, ఆ లేఖపై తల్లి విజయమ్మ సంతకం పెట్టారని పేర్కొంది.
ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే... మన సమాజంలో ఉంటే... ఎంత ప్రమాదమో చెప్పటానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని పేర్కొంది. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయని, ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుందని పేర్కొంది.
ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్ళతో, ఓ సైకోకి రాసిన లేఖ అంటూ వరుస ట్వీట్లు
"మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నానని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా."
"ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటి వరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా అణచివేశారు. కాబట్టి ఎంవోయూలో పేర్కొన్న విధంగా మేము ఒక పరిష్కారానికి అంగీకరించాము. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాను. ఆ విధంగా, 31.08.2019న అమలు చేయబడిన ఎంఓయూ ప్రకారం, నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి."
"మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎంవోయూ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది."
"ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం, దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేశారు. చట్టబద్దంగా మీ కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు."
"ఎంవోయూ ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, ఎంవోయూ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్, సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరికాదు. మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్లపై సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి, కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్లో నాకు వాటాలు లేకుండా చేయాలనే మీ ఉద్దేశ్యంతో ఇది జరిగింది. చట్టబద్దంగా దాని మీద నాకు పూర్తి అర్హత ఉంది." అని షర్మిల రాసిన లేఖను టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది.
ఈ సందర్భంగా జగన్‌పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నయ అన్న ప్రేమతో ఆస్తిలో తన సమాన వాటాను షర్మిల వదులుకున్నారని, కానీ జగన్ సొంత చెల్లి అని కూడా చూడకుండా దారుణంగా మోసం చేశాడని ఆరోపించింది. సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నాడని, అలాగే సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యాడంటూ జగన్‌పై మండిపడింది. చట్టబద్దంగా కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవడానికి తన సొంత తల్లి, చెల్లి మీద కూడా కేసులు పెట్టాడని విమర్శలు గుప్పించింది. .జగన్ సైకో మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని పేర్కొంది. జగన్ ఆస్తుల కోసం తన సొంత తల్లి, చెల్లిని కూడా కోర్టుకి లాగాడని ఆరోపించింది.