Sanjay Verma: భారత్‌కు కెనడా వెన్నుపోటు పొడిచింది... సంబంధాల పతనం ఊహించలేదు: సంజయ్ వర్మ
- భారత్ పట్ల కెనడా అత్యంత అనైతికంగా ప్రవర్తించిందన్న సంజయ్ వర్మ
- కెనడాలో ట్రూడో క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నారని వ్యాఖ్య
- కెనడాలో హైకమిషనర్‌గా పని చేసిన సంజయ్ వర్మ
భారత్-కెనడా మధ్య సంబంధాలు పతనం కావడం ఊహించనిదని హైకమిషనర్‌గా పని చేసిన సంజయ్ వర్మ వెల్లడించారు. భారత్‌పై కెనడా ఇటీవల ప్రవర్తించిన తీరు చాలా అసహ్యంగా ఉందని మండిపడ్డారు. స్నేహపూర్వక ప్రజాస్వామ్యంగా భావించిన దేశం భారత్‌ను వెన్నుపోటు పొడిచిందన్నారు. అత్యంత అనైతికంగా ప్రవర్తించిందన్నారు.
కెనడాలో జస్టిన్ ట్రూడో క్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు కెనడాలో ఎన్నికలు జరిగితే ట్రూడో విజయం సాధించడం చాలా కష్టమన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినేలా కెనడా ప్రవర్తించిందన్నారు. కెనడాలో తాము ఎలాంటి రహస్య ఆపరేషన్లు చేయలేదని స్పష్టం చేశారు.
కానీ భారత్‌పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసిందని ధ్వజమెత్తారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని గుర్తు చేశారు. కెనడాలో న్యాయవ్యవస్థ సున్నితంగా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే అక్కడ ఖలిస్థానీలు ఆశ్రయం పొందుతున్నారని ఆరోపించారు. అక్కడ ఖలిస్థాని మద్దతుదారులు కొంతమందే ఉన్నారని, వారే అక్కడి సిక్కు కుటుంబాలను వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు అక్రమ వ్యాపారులు చేస్తున్నారని ఆరోపించారు.