Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్మీ వాహనంపై దాడి
- ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృత్యువాత
- బారాముల్లాలో భద్రతా బలగాలు-ముష్కరుల మధ్య కొనసాగుతున్న ఎన్కౌంటర్
- తీవ్రవాదుల దుశ్చర్యలపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు. ఎల్వోసీకి సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని నాగిన్ పోస్ట్‌కి దగ్గరలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు పౌరులు చనిపోయారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు (సహాయ కార్మికులు) మృత్యువాతపడ్డారు. వైద్య చికిత్స కోసం తక్షణమే హాస్పిటల్‌కు తరలించాం. ఎన్కౌంటర్ పురోగతిలో ఉంది’’ అని పేర్కొంది.
ఈ ఘటన ఉగ్రవాదుల చొరబాట్లపై ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దులో చొరబాట్లు మళ్లీ మొదలయ్యాయని ఆర్మీ మూలాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి బలగాలు నిఘాను పెంచాయి. నిజానికి ఈ ప్రాంతమంతా ఆర్మీ అధీనంలోనే ఉంటుంది. వేసవి ప్రారంభంలో ఒక ఉగ్రవాద గ్రూపు భారత్‌లోకి చొరబడి అఫ్రావత్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలలో దాగినట్టు గతంలో రిపోర్టులు వెలువడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పారు.
కాగా ఉగ్రవాదుల దుశ్చర్యపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో ఇటీవల వరుస ఉగ్ర దాడులు జరుగుతుండడం కలవరపరుస్తోందని ఆయన అన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బొటాపత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి చాలా దురదృష్టకర వార్త అని అన్నారు. మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ దాడిని ఖండించారు.
కాగా గత ఐదు రోజుల వ్యవధిలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండవ ఉగ్రవాద దాడి ఇది. గత ఆదివారం గందర్బల్ జిల్లాలో గగాంగీర్ ప్రాంతంలోని జెడ్-మోర్ సొరంగం నిర్మాణ స్థలంలో కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు, ఒక డాక్టర్ చనిపోయిన విషయం తెలిసిందే.