Sivaramakrishna: బెయిల్ రద్దు.. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మళ్లీ అరెస్ట్!
- రూ.10 వేల కోట్ల విలువైన భూముల కాజేతకు యత్నించారంటూ శివరామకృష్ణపై ఆరోపణలు
- ఈ కేసులోనే ఈ నెల 17న అరెస్ట్
- 18న బెయిల్.. 19న విడుదల
- అయితే, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు
- బెయిల్ రద్దు కావడంతో గురువారం మళ్లీ అరెస్టు
నకిలీ పత్రాలతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ. 10వేల కోట్ల విలువ చేసే భూములను కొట్టేయాలని యత్నించిన కేసులో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను ఓయూ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో అక్టోబర్ 17న ఆయన్ను ఓయూ పోలీసులు అరెస్టు చేయగా.. 18న బెయిల్ రావడంతో 19న విడుదలయ్యారు.
అయితే, బెయిల్ షరతుల ప్రకారం పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలనే నిబంధనను శివరామకృష్ణ ఉల్లంఘించారంటూ ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు నాంపల్లిలోని నాలుగో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.
దాంతో న్యాయమూర్తి ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం ఆదేశాలిచ్చారు. దాంతో పోలీసులు గురువారం నిర్మాత శివరామకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసులో నిందితుల అరెస్టు, రిమాండు వివరాలు బయటకురాకుండా ఓయూ పోలీసులు గోప్యత పాటించడంపై విమర్శలు వస్తున్నాయి.
రిమాండు రిపోర్టు కూడా సరిగా తయారుచేయలేదని సమాచారం. దీంతో నగర పోలీసు ఉన్నతాధికారులు స్పెషల్ బ్రాంచితో విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బెయిల్ రద్దు కోసం ఓయూ పోలీసులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.