KL Rahul: కేఎల్ రాహుల్ బిగ్ ట్విస్ట్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడాలని యోచన?

Reports saying that KL Rahul is thinking about to leave Lucknow Super Giants

  • లక్నో రిటెన్షన్‌పై కెప్టెన్ ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం
  • ఇటీవల యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ఏదీ చెప్పని రాహుల్
  • రిటెన్షన్ జాబితా ప్రకటించడానికి తెరపైకి ఆసక్తికర కథనం

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు స్టార్ ప్లేయర్‌ కేఎల్ రాహుల్ ట్విస్ట్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో కొనసాగడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. లక్నో రిటెన్షన్ ఆఫర్‌‌పై అతడు ఏమీ చెప్పలేదని కథనాలు వెలువడుతున్నాయి.

కేఎల్ రాహుల్ ఇటీవల లక్నో జట్టు యజమానులతో సమావేశమయ్యాడని, అయితే కొనసాగించాలని ఫ్రాంచైజీ ఎంచుకున్నప్పటికీ అంగీకరించాలా? వద్దా? అనే దానిపై అతడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో’ కథనం పేర్కొంది. రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు ఇంకా వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో రాహుల్ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారిందని తెలిపింది.

నిజానికి కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైందంటూ గత కొంత కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, మెంటార్ జహీర్ ఖాన్ ఉమ్మడి నిర్ణయానికి వచ్చారంటూ వార్తలు వచ్చాయి. రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ పేరుని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అయితే తాజా కథనం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.

కాగా కేఎల్ రాహుల్ ఎక్కువ సమయం క్రీజులో గడుపుతున్నాడని, అది లక్నో విజయావకాశాలను దెబ్బతీస్తోందని కోచ్ లాంగర్, జహీర్ ఖాన్ విశ్లేషణ చేసినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. ఈ కారణంగానే అతడిని పక్కన పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు రాహుల్ ప్రదర్శన కూడా నిరాశాజనకంగా ఉంది. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ చర్చనీయాంశంగా మారింది. 2019 సీజన్ నుంచి 2024 వరకు ఒక్కసారి కూడా 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయలేదు. 2024 సీజన్‌లో 45 సగటు, 134 స్ట్రైక్ రేట్‌ బ్యాటింగ్ చేశాడు.

  • Loading...

More Telugu News