HYDRA: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు... సీఎస్ సహా పలువురికి నోటీసులు
- హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ జారీ
- ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం
- ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేయాలంటూ మాజీ కార్పోరేటర్ పిల్ దాఖలు
హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ కార్పోరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆ పిల్లో కోరారు.
ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తదితరులు ఉన్నారు.
హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల ఆమోదం తెలిపారు. హైడ్రా కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించేలా, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలైంది.