Chandrababu: రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచేలా పనిచేయాలి: సీఎం చంద్రబాబు
- త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
- ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ
- టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు నాలుగు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో... ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి... కృష్ణా జిల్లా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని టీడీపీ నేతలకు సూచించారు.
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు నవంబరు 6వ తేదీ లోపు పూర్తిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలిచేలా చూడాలని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ శ్రేణులను కూడా కలుపుకుని సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్దేశించారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని, 2029 ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. మండలాల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలు పెట్టాలని అన్నారు. ప్రతి చోట మూడు పార్టీల నేతలతో సమన్వయ భేటీలు నిర్వహించాలని తెలిపారు.