Illegal Layouts: గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై చర్యలు
- గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 40 వరకు అక్రమ లేఅవుట్లు
- బోర్డులు, హద్దు రాళ్లు తొలగించిన అధికారులు
- అనధికార లేఅవుట్లలో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయవద్దన్న కమిషనర్
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై అధికారులు కొరడా ఝళిపించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఆర్టీసీ ఆఫీసు రోడ్డు, సీతయ్యడొంక రోడ్డులోని లేఅవుట్లలో బోర్డులు, హద్దురాళ్లు తొలగించారు. అక్రమ లేఅవుట్లపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కార్పొరేషన్ అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు.
దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ... గుంటూరులో ఇప్పటివరకు 40 అక్రమ లేఅవుట్లను గుర్తించామని వెల్లడించారు. అనధికార లేఅవుట్లపై వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. అనధికార లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ వివరించారు.
అనధికార లేఅవుట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. అనధికార లేఅవుట్ల వల్ల ల్యాండ్ టైటిల్ వివాదాలు, కోర్టు కేసులు, మౌలిక సదుపాయాల సమస్యలు వస్తాయని... ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. అక్రమ లేఅవుట్లలో ఇళ్లు, స్థలాలు తీసుకుంటే అనేక రకాలుగా నష్టపోతారని స్పష్టం చేశారు.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని రకాల అనుమతులున్న లేఅవుట్లు చాలా ఉన్నాయని, వాటిలోనే ఇళ్లు, ప్లాట్లు తీసుకోవాలని సూచించారు.