Seediri Appalaraju: పలాసలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం
- బాలికపై టీడీపీ పలాస మండల అధ్యక్షుడు ఢిల్లీరావు దాడిచేసినట్టు ఆరోపణలు
- టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త దాడి
- వైసీపీ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తల దాడి
- ఈ రెండు ఘటనలతో పలాసలో ఉద్రిక్తత
- దాడి కారకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి సీదిరి డిమాండ్
- పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి గృహ నిర్బంధం
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ-పలాసలో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య గొడవతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాలికపై తెలుగు యువత పలాస మండల అధ్యక్షుడు ఢిల్లీరావు దాడి ఆరోపణలు, పోలీస్ స్టేషన్‌లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో పలాసలో శనివారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడి ఘటనలపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అయితే, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీనివ్వడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కేటీరోడ్డులో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం గొడవకు దారితీసింది. టీడీపీకి చెందిన కొర్ల విష్ణుపై వైసీపీ కార్యకర్త అల్లు రమణ దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. విష్ణు తనపై కత్తితో దాడికి యత్నించించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ రమణతోపాటు మాజీమంత్రి అప్పలరాజు అనుచరుడు మన్మథరావుపై వారు దాడిచేశారు. అక్కడ ఆ సమయంలో ఉన్న కానిస్టేబుల్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురితోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ మోహన్‌రావు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ కార్యకర్త రమణ నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు.